CINEMATelugu Cinema

సమకాలీన తెలుగు సాహిత్యంలో నవలా చక్రవర్తి.. యండమూరి వీరేంద్రనాథ్..

తెలుగు నవల రచన 19వ శతాబ్ది అంత్యం నుంచి ప్రారంభం అయ్యింది. వీరేశలింగం గారు కొందరు తొలి తెలుగు నవలగా, మరికొందరు పరిశోధకులు తొలినాళ్ళలోని ఒక తెలుగు నవలగా భావించే శ్రీరంగరాజ చరిత్రము వ్రాశారు. పరవస్తు చిన్నయసూరి గారు పంచతంత్రం వ్రాస్తూ వదిలిపెట్టిన విగ్రహతంత్రాన్ని కందుకూరి వీరేశలింగం గారు పూర్తిచేసి ప్రచురించారు. అదే సమయంలో క్రిస్టియన్ కళాశాల మద్రాసులో పనిచేస్తున్న “సమర్ధి రంగయ్యచెట్టి” గారు వీరేశలింగం గారి ప్రతిభను మెచ్చుకుంటూ అభినందన లేఖ వ్రాస్తూ తెలుగులో “స్వకపోలకల్పితమైన వచన ప్రబంధ రచన” కు మీరు పూనుకోలేరా? అని మెచ్చుంటూనే ప్రోత్సహించే సూచనలు చేశారు.

శ్రీరంగరాజ చరిత్రము ఆలోచనకు అదే మొదలు కావచ్చునని సాహిత్య విమర్శకులు భావించారు. 1892 వ సంవత్సరంలో న్యాయవాది సుబ్బారావు సంపాదకత్వంలో వెలువడిన “చింతామణి” పత్రిక నవలను బాగా ప్రోత్సహించి, నవలల పోటీలు నిర్వహించి నవలా సాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది. నవలా రచనకు కావలసిన సూత్రాలను నిర్ణయించింది. అయితే ఈ ప్రారంభకాలంలో వెలువడిన నవలలు ఎక్కువగా సంఘ సంస్కరణల ప్రాముఖ్యత కనిపిస్తుంది.

రచనలు నాలుగు రకాలు. 1) ఎక్కువమంది చేత ఎక్కువకాలం చదివించబడేవి. ఉదాహరణ రామాయణం, మహాభారతం, భాగవతం మొదలైనవి. 2) తక్కువ మంది చేత ఎక్కువకాలం చదివించబడేవి. ఉదాహరణ శ్రీ శ్రీ కవితలు, కృష్ణశాస్త్రి కవితలు. ఇవి వంద, రెండు వందల సంవత్సరాలు చదువుతూనే ఉంటారు. 3) ఎక్కువ మంది చేత తక్కువ కాలం చదివించబడేవి. విపరీతమైన ప్రజాదరణతో వస్తాయి. సుమారు పదిహేను సంవత్సరాలు చదువుతారు. ఉదాహరణ కొవ్వలి రచనలు, యండమూరి తులసీదళం. 4) తక్కువ మంది చేత తక్కువ కాలం చదివించబడేవి ఎందుకు వ్రాశారో తెలియదు, వాటిని ఎవ్వరూ చదువరు.

తెలుగునాట ఎంతో మందిని పాఠకులుగా మార్చిన ఘనత కాల్పనిక సాహిత్యానికే దక్కుతుంది. అప్పట్లో యద్దనపూడి సులోచనారాణి, ఆరికెపూడి కౌసల్యాదేవి నవలలు పాఠకులను పరవశింప చేయడమే కాదు, చిత్రసీమలోనూ విజయకేతనం ఎగురవేశాయి. యద్దనపూడి ‘నవలారాణి’గా రాజ్యమేలారు. తెలుగు నవల అంటే కేవలం మహిళలు మాత్రమే వ్రాయాలి,  రచయిత్రి నవలలకే ఆదరణ ఎక్కువగా ఉంటుందని అనుకునే రోజులలో ఒక మెరుపులా మెరిసిన నవలా రచయిత రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు. యండమూరి వీరేంద్రనాథ్ కలం సరికొత్త వచనంతో పాఠకులను ఆకట్టుకుంది. ఆయన రచనలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతూనే సగటు పాఠకుని ఆకట్టుకొనే ఆకర్షణీయమైన పదజాలంతో పులకింప చేశాయి. తెలుగు చిత్ర సీమలో హీరోగా చిరంజీవి గారికి ఎంతటి పేరు ప్రఖ్యాతులు, ప్రేక్షకాభిమానం ఉన్నాయో, తెలుగులో నవలా రచయితగా అంత పేరు తెచ్చుకున్న రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు.

ఒకప్పుడు నవలా ప్రియులు యండమూరి వీరేంద్రనాథ్ గారి పేరు వింటే చాలు, చెవికోసుకొనేవారు. తెలుగులో కమర్షియల్ నవలలకు పెద్దపీట వేసి.. పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన మేటి రచయిత యండమూరి గారు. తన రచనలలో కొన్ని విమర్శలపాలైనా.. ఒక రచయితగా తన ప్రజాదరణ ఎప్పుడూ తగ్గలేదు. నాటి తరానికి అత్యధిక ప్రజాదరణ కలిగిన నవలా రచయితగా పరిచయమై నేటి తరానికి ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కూడా  సేవలందించారు తాను. కొన్నాళ్లు సినీ రచయితగా, దర్శకుడిగా కూడా ఒక్క వెలుగు వెలిగిన యండమూరి గారు తెలుగు రచనా లోకంలో ఎప్పటికే ఒక ప్రభంజనమేనని చెప్పుకోవాలి.

జీవిత విశేషాలు…

జన్మ నామం :    యండమూరి వీరేంద్రనాథ్,

ఇతర పేర్లు  :  యండమూరి

జననం    :     14 నవంబరు 1948    

స్వస్థలం   :    రాజోలు, తూర్పు గోదావరిజిల్లా, ఆంధ్రప్రదేశ్

వృత్తి      :      చార్టర్డ్ అకౌంటెంట్, రచయిత, సినిమా, టి.వి దర్శకుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు

తండ్రి    :   యండమూరి చక్రపాణి

తల్లి     :   నరసమాంబ 

జీవిత భాగస్వామి  :    అనుగీత

పిల్లలు  :   ప్రణీత్

పురస్కారాలు   :    1982 లో సాహిత్య అకాడెమీ అవార్డు

నేపథ్యం…

యండమూరి వీరేంద్రనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలు లో 14 నవంబరు 1948లో జన్మించారు. యండమూరి గారి తండ్రి చక్రపాణి గారు, తల్లి నరసమాంబ. తన తండ్రి గారు ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేస్తుండటం వలన ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలు తిరిగుతూ ఉండేవారు. అందువలన యండమూరి గారి బాల్యం అనేక ప్రాంతాలలో గడిచింది. తన ప్రాథమిక విద్య కాకినాడలో కొంత భాగం, రాజమండ్రి లోనూ కొంత భాగం సాగింది. యండమూరి గారు తన ఆరవ తరగతి జమ్మలమడుగు లోనూ, ఏడవ తరగతి అనంతపురం లోనూ, ఎనిమిది, తొమ్మిది తరగతులు ఖమ్మం లోనూ, పదో తరగతి, ఇంటర్మీడియట్ హైదరాబాద్ లోనూ, బి.కాం కాకినాడ లోనూ చదువుకున్నారు. 1972లో సీ.ఏ. పట్టా కూడా పొందియున్నారు. యండమూరి వీరేంద్రనాథ్ గారి తాత గారు మంచి పండితులు. వీరేంద్రనాథ్ గారి తండ్రి కుటుంబాన్ని పోషించడం కష్టతరమైన సమయంలో యండమూరి గారు కొందరి సహాయంతో చదువు కొనసాగించారు. ఆ సమయంలో తన క్షవరం తానే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ నియమాన్ని ఇప్పటికీ వీరేంద్రనాథ్ గారు పాటిస్తూ ఉండడం విశేషం.

వ్యక్తిగత జీవితం…

యండమూరి వీరేంద్రనాథ్ గారు తన చదువు పూర్తి అయ్యాక చార్టెడ్ అకౌంటెంట్ గా ఉద్యోగంలో చేరిపోయారు. వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ గా భాద్యతలు స్వీకరించాక యండమూరి గారు ఐదు సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లో పనిచేశారు. ఆ తరువాత పది సంవత్సరాల పాటు ఆంధ్రా బ్యాంకు లో చిన్న తరహా పరిశ్రమల విభాగానికి అధిపతిగా సేవలందించారు. యండమూరి వీరేంద్రనాథ్ గారికి 10 మార్చి 1974 లో అనుగీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు జన్మించారు. ఆ కుమారుడి పేరు ప్రణీత్. నవలా సాహిత్యం పైనున్న తన అభిరుచిని వదులుకోలేక యండమూరి గారు పూర్తిస్థాయి రచయితగా మారడం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

నవలా రచనలు…

 బాలగంగాధర తిలక్ కవితలపై విపరీతమైన ఆసక్తి ఉన్న యండమూరి గారు కవితలు పలికించారు, కొన్ని కథలూ వ్రాశారు. నిజానికి యండమూరి గారు పొట్టిగా ఉండేవారు. దాంతో చిన్నప్పటినుండి తనకు ఆత్మ న్యూనతా భావం (ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేసుకునే తత్వం) ఉండేది. తన మామయ్య రావుపాటి వేణుగోపాల రావు గారి సూచన మేరకు చందమామ ఒక కథ వ్రాశారు. దానిని చదివిన కొంతమంది తనను ప్రశంసించారు. అలా ప్రశంసలు వస్తుండడంతో కొద్ది కొద్దిగా ఆత్మన్యూనతా భావాన్ని వదిలేస్తూ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవడం మొదలుపెట్టారు. అలా 18 సంవత్సరాల వయస్సులో బీ.కాం పూర్తయ్యి సి.ఏ గా తన ప్రస్థానం మొదలుపెడుతున్న సందర్భంలో తన రచనలు చేస్తూ ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంటూ వచ్చారు.

తాను లాల్ బహుదూర్ శాస్త్రి గారిని తనకు ప్రేరణగా తీసుకునేవారు. ఎందుకనగా లాల్ బరహదూర్ శాస్త్రి గారు కూడా పొట్టిగానే ఉండేవారు. పొట్టిగా ఉన్నాననే భావనను “నెపోలియన్ సిండ్రోమ్” అంటారు. అది ఒక మానసిక రోగం కూడా. యండమూరి గారి రచనలు తనను ఎంతగా ప్రభావితం చేశాయంటే ఏకంగా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా సాహిత్య అకాడమీ అవార్డు తీసుకునేంతగా. నిజానికి తాను ఇంకా రెండు అంగుళాల పొడవు కనుక ఉండుంటే రచయిత కావాలానే కసి మాత్రం లేకపోయేది అని తాను చెబుతుండేవారు. “ఏదైతే నీలో లేదో అది మరచిపో, ఏదైతే నీలో ఉందో అది మెరుగు పరుచుకో” అని తన పిల్లలకు చెబుతుంటారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. కొడవగంటి కుటుంబరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనలు కూడా తాను బాగా ఇష్టపడుతుండేవారు.

యండమూరి గారు ముందుగా నాటకాలూ వ్రాశారు. ఆ నాటకాలు అలరించాయి. ఆ సమయంలోనే వీరేంద్రనాథ్ గారు రాసిన “పర్ణశాల” సీరియల్ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. ఆ సీరియల్ తో వీరేంద్రనాథ్ కు ఎనలేని గుర్తింపు లభించింది. ఆ తరువాత యండమూరి గారి కలం నుండి జాలువారి ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైన “తులసి” , “తులసీదళం” సీరియల్స్ తెలుగు పాఠకలోకాన్ని ఓ ఊపు ఊపేశాయి. ఆ నవలల విజయంతో యండమూరి గారు ఉత్తమ రచయిత అయిపోయారు. ఆంధ్రజ్యోతి లో “అభిలాష” సీరియల్ పాఠకులను ఆకట్టుకుంది. తరువాత “డబ్బు టు ద పవరాఫ్ డబ్బు” , “రాక్షసుడు”,  “మరణమృదంగం” సీరియల్స్ గానూ, నవలలుగానూ పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

సినీ నేపథ్యం…

చిత్రసీమలో యండమూరి వీరేంద్రనాథ్ తొలుత స్క్రిప్ట్ రైటర్ గా పనిచేశారు. మృణాల్ సేన్ గారు తీసిన “మృగయా” సినిమా కు యండమూరి గారు వ్రాసిన “ఆర్తి” అనే నాటకానికి దగ్గరి పోలికలున్నాయి. మృణాల్ సేన్ గారు హైదరాబాద్ ఏ.జి.కార్యాలయం కు వచ్చినప్పుడు యండమూరి గారిని ప్రశంశించారు. రవీంద్రభారతి లో యండమూరి గారు వ్రాసిన “కుక్క” అనే నాటకాన్ని ప్రదర్శింపబడడం చూసిన మృణాల్ సేన్ గారు గారు తన సినిమా కు యండమూరి గారికి అవకాశం ఇచ్చారు. అదే “ఒక వూరి కథ”. ఆ “ఒకవూరి కథ” కు స్క్రిప్ట్ యండమూరి గారే వ్రాశారు. 18 డిసెంబరు 1980 లో విడుదల అయిన “ఆడది గడప దాటితే” చిత్రానికి యండమూరి గారు సంభాషణలు వ్రాశారు.

వంశీ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం “మంచుపల్లకి” కి మాటలు పలికించారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ తొలి చిత్రం “అభిలాష” సినిమా యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల ఆధారంగా తెరకెక్కిందే. ఈ చిత్రంలో చిరంజీవి గారు కథానాయకులు. ఆ సినిమాకు ఏ.కోదండరామిరెడ్డి దర్శకులు, ఇళయరాజా సంగీత దర్శకులు, కె.ఎస్.రామారావు నిర్మాత. “అభిలాష” ఘనవిజయం సాధించిన తరువాత ఈ నలుగురి కలయిక లో వరుసగా “ఛాలెంజ్” , “రాక్షసుడు”, “మరణమృదంగం” చిత్రాలు విడుదలయ్యాయి. చిరంజీవిని నవలా నాయకునిగా నిలిపింది యండమూరి గారు అనే చెప్పాలి.

మరోవైపు యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలల ఆధారంగా “ఒక రాధ ఇద్దరు కృష్ణులు” , “దొంగమొగుడు”, “రక్తాభిషేకం”, “సంపూర్ణ ప్రేమాయణం”, “ముత్యమంత ముద్దు”, “కాష్మోరా” వంటి చిత్రాలు తెరకెక్కి అలరించాయి. యండమూరి వీరేంద్రనాథ్ గారి సీరియల్స్ ను ఎంత ఆసక్తిగా పాఠకులు చదివారో, అంతే ఆసక్తిగా అవి నవలలుగా వచ్చాక కొనుక్కొని మరీ చదివారు. ఇక యండమూరి గారి రచనల ఆధారంగా సినిమాలు వస్తున్నాయంటే, వాటిపై జనం ఎంతో మోజుపడేవారు. అందుకు తగ్గట్టుగానే యండమూరి గారు తన రచనలతో రూపొందిన పలు చిత్రాలు జనాన్ని అలరించాయి. తన నవలల ఆధారంగా కొన్ని కన్నడ చిత్రాలు తెరకెక్కి ఆకట్టుకున్నాయి. చిరంజీవి గారు “జగదేకవీరుడు అతిలోకసుందరి” చిత్రానికీ యండమూరి వీరేంద్రనాథ్ గారే కథను సమకూర్చారు.

సినిమాలుగా వచ్చిన యండమూరి నవలలు..

★ వెన్నెల్లో ఆడపిల్ల      …   హలో ఐ లవ్ యూ

★ తులసిదళం ..    తులసిదళం

★ తులసి…    కాష్మోరా

★ అభిలాష…    అభిలాష

★ డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు…         ఛాలెంజ్

★ అగ్నిప్రవేశం…            అగ్నిప్రవేశం

★ ఆఖరి పోరాటం          …  ఆఖరి పోరాటం

★ మరణ మృదంగం…                మరణ మృదంగం

★ నల్లంచు తెల్లచీర…   దొంగమొగుడు

★ ఒక రాధ-ఇద్దరు కృష్ణులు… ఒక రాధ-ఇద్దరు కృష్ణులు

★ స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్… స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్

★ రుద్రనేత్ర     …    రుద్రనేత్ర

★ రాక్షసుడు….                రాక్షసుడు

★ ధ్రిల్లర్…  ముత్యమంత ముద్దు

★ అంతర్ముఖం…          సంపూర్ణ ప్రేమాయణం

★ దొంగ మొగుడు చిత్రం తరువాత నల్లంచు తెల్లచీర నవల వ్రాయబడింది. రెండింటి మధ్య చాలా తేడాలు (పాత్రలు, కథలలో ) ఉన్నాయి..

డేగ రెక్కల చప్పుడు…

వర్తమాన కాలంలో విపరీతంగా రగులుతున్న ప్రధాన సమస్య అయినటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదం గురించిన కథాంశంతో వీరేంద్రనాథ్ గారు వ్రాసిన “డేగ రెక్కల చప్పుడు” సమాకాలికమైన వాస్తవ సంఘటన ఆధారంగా నిజమైన పాత్రలను ఎంచుకుని కొంచెం కట్టుకథ తో కల్పితం కలిపి వ్రాసిన నవలా “డేగ రెక్కల చప్పుడు”. అది చదువుతుంటే  తాలిబన్లు, ఆల్ ఖైదా ఆపరేషన్లు, 9/11 సంఘటనలు, పాకిస్తాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లే ఉగ్రవాదులు ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఈ నవల ఒక పత్రికలో సీరియల్ గా వచ్చినప్పటికీ కూడా నేరుగా నవలగా విడుదలైన మొదటి 15 రోజులలోనే మూడువేల కాపీలు అమ్ముడవ్వడం ఈ నవల సత్తా ఏమిటో తెలియజేస్తుంది.

వ్యక్తిత్వ వికాస రచనలు…

★ విజయానికి అయిదు మెట్లు

★ విజయానికి ఆరవ మెట్టు

★ విజయ రహస్యాలు

★ మీరు మంచి అమ్మాయి కాదు

★ మిమ్మల్ని మీరు గెలవగలరు,

★ విజయంలో భాగస్వామ్యం

★ విజయం వైపు పయనం

★ మైండ్ పవర్ నెంబర్ ఒన్ అవడం ఎలా?

★ గ్రాఫాలజీ

★ తప్పు చేద్దాం రండి..

నాటికలు..

★ కుక్క

★ మనుషులోస్తున్నారు జాగ్రత్త

★ చీమకుట్టిన నాటకం

★ రుద్రవీణ

చిరంజీవి ని నవలా నాయకుడిని చేసిన యండమూరి…

న‌వ‌లా ర‌చ‌యిత‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యండమూరి వీరేంద్రనాథ్ గారి అనేక న‌వ‌ల‌లు సినిమాలుగా రూపుదిద్దుకొని వెండితెర‌పై అల‌రించాయి. ప్రత్యేకంగా తన న‌వ‌ల‌లు సినిమాలుగా మారి చిరంజీవి గారికి అద్భుతమైన విజయాలు అందించాయి. వాటిల్లో కొన్ని కోదండ‌రామిరెడ్డి గారు దర్శకత్వం వహించగా, ఒక్క దానికి మాత్రం యండ‌మూరి గారే స్వ‌యంగా దర్శకత్వం వహించారు.

1. అభిలాష(1983)

చిరంజీవి, రాధిక గార్ల కలయికలో  1983లో కోంద‌డ రామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇదే పేరుతో యండ‌మూరి రాసిన న‌వ‌ల‌కు వెండితెర రూప‌మైన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

2. ఛాలెంజ్ (1984)

చిరంజీవి, సుహాసిని, విజయశాంతి గార్ల కలయికలో 1984లో కోంద‌డ రామిరెడ్డి గారి దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. “డబ్బు టు ది పవరాఫ్ డబ్బు” పేరుతో యండ‌మూరి రాసిన న‌వ‌ల‌కు వెండితెర రూప‌మైన ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.

3. రాక్షసుడు (1986)

చిరంజీవి , రాధ, సుహాసిని గార్ల కలయికలో 1986లో కోంద‌డ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇదే పేరుతో యండ‌మూరి గారు వ్రాసిన న‌వ‌ల‌కు వెండితెర రూప‌ం. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం సాధించింది.

4. దొంగమొగుడు(1987)

చిరంజీవి, మాధవి, భానుప్రియ, రాధికల కలయిక లో 1987లో కోంద‌డ రామిరెడ్డి గారి దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. “నల్లంచు తెల్ల చీర” పేరుతో యండ‌మూరి గారు వ్రాసిన న‌వ‌ల‌కు వెండితెర రూప‌మైన ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

5. స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్(1991)

చిరంజీవి, విజయశాంతి, నిరోషాల కలయికలో 1991లో యండ‌మూరి గారు తాను ర‌చించిన “స్టువ‌ర్ట్ పురం పోలీస్ స్టేష‌న్” అనే న‌వ‌ల‌ను అదే పేరుతో తానే స్వ‌యంగా దర్శకత్వం వహించారు. తన అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ చిత్రం పరాజయం పాలైంది.

ఇతర రచనలు..

★ చదువు ఏకాగ్రత

★ మంచి ముత్యాలు (కొటేషన్స్)

★ పడమటి కోయిల పల్లవి (కవిత్వం)

★ పిల్లల పేర్ల ప్రపంచం

★ పాపులర్ రచనలు చేయడం ఎలా?

★ మిమ్మల్ని మీ పిల్లలు ప్రేమించాలంటే?

★ మంచి రచనలు చేయడం ఎలా?

సినిమా మాటల రచయితగా

★ కొండవీటి దొంగ

★ అభిలాష

★ మంచు పల్లకి

★ స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్ – కథ

★ ప్రియరాగాలు – కథ

దర్శకుడిగా మెగాఫోన్ చేతబూని…

యండమూరి వీరేంద్రనాథ్ గారు కలం పట్టి రచనలు చేయడమే కాకుండా తన రచనల ద్వారా తెరకెక్కిన “అగ్నిప్రవేశం”, “స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్” చిత్రాలకు తానే మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలూ అంతగా అలరించలేదు. చిరంజీవి గారు హీరోగా నటించిన “స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్” పరాజయం పాలయ్యింది. దాంతో యండమూరి గారు సినిమా ప్రస్థానం మునుపటిలా సాగలేదు. చాలా రోజుల తరువాత 2009లో ఏ.కోదండరామిరెడ్డి తెరకెక్కించిన “పున్నమి నాగు” చిత్రానికి కథ సమకూర్చారు యండమూరి గారు. అదీ అంతగా ఆకట్టుకోలేక పోయింది. “దిండు కింద నల్లత్రాచు” నవల ఆధారంగా చిరంజీవి క్రియేషన్స్ బ్యానర్‌పై చల్లపల్లి అమర్ నిర్మించిన దుప్పట్లో మిన్నాగు (2019) సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వం వహించారు. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై కూనం కృష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి నిర్మించిన “అతడు.. ఆమె.. ప్రియుడు”… చిత్రం 04 ఫిబ్రవరి 2022 నాడు విడుదల అయ్యింది. ఈ సినిమాకు కూడా యండమూరి వీరేంద్రనాథ్ గారే దర్శకత్వం వహించారు.

సినీ దర్శకుడిగా

★ అగ్నిప్రవేశం

★ స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్

★ దుప్పట్లో మిన్నాగు (2019)

★ అతడు ఆమె ప్రియుడు (2022)

నటుడిగా

★ విలేజ్ లో వినాయకుడు

★ బన్నీ అండ్ చెర్రీ (2013)

యండమూరి గారి రచనా శైలికి ఉదాహరణలు..

యండమూరి గారు వివిధ నాటకాలు, నాటికలు, నవలలు, సినిమాల కోసం, వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, ఉపన్యాసాలలో తాను వ్రాసిన ఈ పంక్తులు, చెప్పిన మాటలు యండమూరి గారి శైలి ఏమిటో చెబుతాయి.

★ ఏ దూరదేశాల్లో నీవుంటావో నాకు తెలియదు నేస్తం! కానీ, ఏదో ఒకరోజు రాత్రి ఎప్పటికన్నా చంద్రుడు ఆరోజు మరింత ప్రకాశవంతంగా ఉన్నట్టు నీకనిపిస్తే… ఏ దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నదనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు… చాలు!

★ ప్రేమంటే మనిషి తర్కాన్ని వదిలిపెట్టడమే కదా! తన ప్రవర్తన తనకి అంతుపట్టకపోవడం కూడా ప్రేమే!

★ నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం.

★ మరణం అంటే ఏమిటి? లేకపోవడమేగా? మనం ఉండం. అంతా ఉంటుంది. మందాకినీ గలగలలు, నీహారికా బిందు సందోహాలు, దూకే జలపాతాలు, గుడి ప్రాంగణంలో పెరిగే గడ్డిపూలు, మలయ మారుతాలూ, మయూర నృత్యాలూ…అన్నీ ఉంటాయి.

★ వినేవాళ్ళుంటే మనిషికి తన ఫ్లాష్ బేక్ లు చెప్పడంకన్నా ఆనందం ఇంకేముంటుంది?

★ దేవుడికి దీపం అవసరంలేదు, చీకట్లో మగ్గుతున్న మీ అంతరాత్మలో దీపం వెలిగించి భగవంతుడి ముందు ఆత్మ విమర్శ చేసుకోండి. అప్పటికీ మీలో కళంకం లేదనిపిస్తే అప్పుడు మీరు నిజమైన దైవభక్తులు.

★ దేశ సరిహద్దులు మనిషి నిర్మించుకున్నవి. ఒక గీతకి కేవలం అటూ ఇటూ ఉండటం వల్ల ఇద్దరు వ్యక్తులు శత్రువులవటం దురదృష్టకరం.

★ కన్నీరా! క్రిందకు జారకే! ఋతువుకాని ఋతువులో గోదావరికి వరదొచ్చిందేమిటి అని భయపడతారే!!

★ జీవితం అంటే తాళం చెవుల గుత్తికాదు- మరొకళ్ళ చేతుల్లో పెట్టి హాయిగా నిద్రపోవడానికి. ముందు మిమ్మల్ని సంస్కరించుకోండి. దాని వల్ల మీ వ్యక్తిత్వం పెరుగుతుంది.

★ ప్రపంచంలో గొప్పవాళ్ళందరూ కీర్తి శిఖరాలను ఒక్క అంగలో గెంతి అధిరోహించలేదు. భార్యతో సహా ప్రపంచం అంతా గాఢనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఒక్కొక్క అడుగు కష్టపడుతూ పైకి పాకారు.

★ విజయమా, విజయమా! వెళుతూ వెళుతూ అధఃపాతాళానికి తోస్తావు, వస్తూ వస్తూ అందలాన్నెక్కిస్తావు-నీకిది న్యాయమా?

★ దెయ్యాలు శ్మశానంలో ఉండవు, మనిషి మనసులోనే ఉంటాయి, భయం అన్న పేరుతో.

★ అపనమ్మకంతో గెలిచిన గెలుపుకంటే, నమ్మకంతో వచ్చిన ఓటమే గొప్ప సంతృప్తి నిస్తుంది..

Show More
Back to top button