CINEMATelugu Cinema

కర్షకుల ఐకమత్యం ద్వారా సమస్యలు ఏవిధంగా పరిష్కరించవచ్చో చూపిన చిత్రం… రోజులు మారాయి…

బ్రిటిషు పాలనలో రైతుల దురవస్థను గూడవల్లి రామబ్రహ్మం గారు “రైతుబిడ్డ” (1939) చిత్రంలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తే, స్వాతంత్రానంతరం రైతుల దుస్థితిని చూపించడానికి హృదయ విదారకంగా “రోజులు మారాయి” చిత్రీకరించారు. ఈ రెండు చిత్రాల నిర్మాణ సంస్థ ఒకటే సారథి ఫిలిమ్స్ కావడం విశేషం. రైతుబిడ్డ లోని పలు పాత్రలు సంఘటనలు సన్నివేశాలు “రోజులు మారాయి”లో యదాతథంగా కనిపించినా దానికి నకలుగా మాత్రం తయారవ్వలేదు. “రైతుబిడ్డ” చిత్రంలో రైతు సమస్యలకు కారణాలు చూపిస్తే, “రోజులు మారాయి” ఆ సమస్యల్ని కర్షకులు ఐక్యత్యం ద్వారా ఎలా పరిష్కరించుకోవచ్చో ఆచరణాత్మకంగా చూపింది.

రోజులు ఎలా మారాయో తెలుసుకుందామని కనకదుర్గమ్మ తల్లే స్వయంగా ఇంద్రకీలాద్రి దిగి రిక్షా ఎక్కి ఆ సినిమా చూడడానికి థియేటర్ కు వెళ్లిందని “రోజులు మారాయి” సినిమా వచ్చినప్పుడు బెజవాడ వీధుల్లో ప్రచారం జరిగింది. 60 ఏళ్ల నాటి మాట అది. కనకదుర్గమ్మ ఏ సినిమా చూడడానికి క్రిందికి దిగి రాదని తెలిసినా కూడా ఒక సినిమా గొప్పతనాన్ని చెప్పడానికి అది కొలబద్ద. అందమైన ఊహ రైతు దుస్థితిని వాస్తవంగా చిత్రీకరించి  ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించిన చిత్రం “రోజులు మారాయి”. ఈ చిత్రం 14 ఏప్రిల్ 1955 నాడు విడుదలై 17 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాలోని “ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా” అనే గీతంలో వహిద రెహ్మాన్ గారు నటించి తరువాత కాలంలో జాతీయ నటిగా తార పథంలో దూసుకుపోవడానికి సోపానమైంది.

జమీందారీ పాలనలో పేద రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించే ప్రయత్నంలో నిర్మాణ సంస్థ సారథి ఫిలిమ్స్ ఆధ్వర్యంలో గూడవల్లి రామబ్రహ్మం గారు రైతు బిడ్డ (1939) సినిమా తీశారు. తరువాత పదహారేళ్లకు అదే నిర్మాణ సంస్థ “సారథి ఫిలిమ్స్” ఇలాంటి రైతు సమస్యలను వివరిస్తూ “రోజులు మారాయి” అనే పేరుతో మరో చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకుంది. ఈ చిత్రానికి నిర్మాత సి.వి.ఆర్.ప్రసాద్, కొండేపూడి లక్ష్మీనారాయణ మరియు దర్శకుడిగా పేరు పొందిన తాపీ చాణక్యతో కలిసి స్క్రీన్‌ప్లే వ్రాశారు. ఈ సినిమాకు ఛాయాగ్రహణం కమల్ ఘోష్ , కూర్పు తిలక్ మరియు అక్కినేని సంజీవి నిర్వహించగా ఈ చిత్రాన్ని దండిమిట్ట గ్రామంలో చిత్రీకరణ జరిపారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయినప్పుడు, చిత్రం యొక్క పంట సన్నివేశాన్ని తయారుచేసి “పాలేరు” చిత్రం కోసం వేణు స్వరపరిచి తాత్కాలికంగా నిలిపివేసిన పాటను నిర్మాత తొట్టెంపూడి రామయ్య    గారి చొరవతో ఈ సినిమాలో చొప్పించారు. “ఏరువాక సాగరో రన్నో చిన్నన్న” అనే పాటను అప్పటికే నర్తకి అయిన వహీదా రెహ్మాన్‌ తో నర్తింపజేశారు.

చిత్ర విశేషాలు….

దర్శకత్వం   :    తాపీ చాణక్య

కథ           :          కొండేపూడి లక్ష్మీనారాయణ

నిర్మాణం   :     సివిఆర్ ప్రసాద్,

వై. రామకృష్ణ ప్రసాద్ (ప్రదర్శకుడు)

స్క్రీన్ ప్లే     :     కొండేపూడి లక్ష్మీనారాయణ, తాపీ చాణక్య, C.V.R ప్రసాద్

తారాగణం  :   అక్కినేని నాగేశ్వరరావు, షావుకారు జానకి

సంగీతం    :    మాస్టర్ వేణు

నేపథ్య గాయకులు :  ఘంటసాల వెంకటేశ్వరరావు, కృష్ణవేణి జిక్కి, పిఠాపురం నాగేశ్వరరావు, కృష్ణ కుమారి 

సాహిత్యం  :  తాపీ ధర్మారావు, కొసరాజు 

ఛాయాగ్రహణం  :   కమల్ ఘోష్

కూర్పు       :      తిలక్, అక్కినేని సంజీవి

నిర్మాణ సంస్థ    :    సారధి స్టూడియోస్

నిడివి      :     190 నిమిషాలు

విడుదల తేదీ   :     14 ఏప్రిల్ 1955

భాష     :     తెలుగు

చిత్ర కథ సంక్షిప్తంగా…

జమీందారు సాగరయ్య దురుద్దేశంతో కరణం సాంబయ్య మరియు గూండా పోలయ్యతో కలసి గ్రామంలో రైతులను దౌర్జన్యం చేస్తుంటారు. నిజాయితీ గల రైతు కోటయ్య తన భార్య, కొడుకు వేణు, కూతురు భారతితో సంతోషంగా కుటుంబ జీవితాన్ని గడుపుతుంటాడు. కోటయ్య జమీందారు సాగరయ్యకు అత్యంత విధేయుడు, కానీ కోటయ్య కొడుకు వేణు జమీందారు దౌర్జన్యాలను ఎప్పుడూ ఎదుర్కొంటుంటాడు.

ఇలా ఉండగా కోటయ్య వేణుకు సన్నిహితుడైన గోపాలంతో తన కూతురు భారతినిచ్చి పెళ్లిచేసి జంటగా మార్చాలని నిర్ణయించుకుంటాడు. గోపాలం తండ్రి వెంకటాద్రి కట్నం కోసం పట్టుబట్టడంతో చేసేదిలేక నిస్సహాయంగా ఉన్న కోటయ్య జమీందారు సాగరయ్య దగ్గర నుండి రుణం కోరతాడు. దానికి జమీందారు సాగరయ్య కోటయ్య ఆస్తిని తాకట్టు పెట్టాలంటాడు. దానిని వేణు తిరస్కరిస్తాడు. దాంతో తండ్రీ కొడుకుల మధ్య విభేదాలు తలెత్తుతాయి. అంతేకాదు గ్రామ బహిష్కరణకు గురైన రత్నం అనే విశ్రాంత ఆర్మీ సైనికుడి కూతురు రాధను వేణు ప్రేమిస్తాడు. అది తెలుసుకున్న సాంబయ్య కోటయ్యపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వేణు ఇల్లు వదిలి రాధను పెళ్లి చేసుకుంటాడు.

రాధను పెళ్లి చేసుకున్న వేణు రైతులందరితో కలిసి వాళ్లకు సహకరిస్తూ సామూహిక వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. దాని కోసం అతను జిల్లా కలెక్టరేట్‌కు వినతిపత్రం పంపుతాడు. ద్వేషాన్ని మనసులో పెట్టుకుని జమీందారు సాగరయ్య వేణుని బాధపెట్టినా కూడా ధైర్యంగా నిలబడి ముందుకు సాగుతాడు. ఆ తరువాత జిల్లా కలెక్టర్ తనిఖీకి వస్తాడు. అక్కడ వేణు సాగరయ్య మరియు సాంబయ్య యొక్క నేరాలను ఛేదించి, సాగు కోసం బంజరు భూములను మంజూరు చేయిస్తాడు. అయినప్పటికీ, వేణు ప్రయత్నానికి అనేక అడ్డంకులను సృష్టిస్తాడు జమీందారు సాగరయ్య. వేణు ఆ అడ్డంకులను అక్కున చేర్చుకుని వాటిని ఎదుర్కొని సంస్కరించి సాగరయ్య, పోలయ్యను కొట్టి, మెడ బంధించేస్తాడు.

అందుకే, రాధ తన సామరస్యంతో గొడవను పరిష్కరించుకున్నప్పుడు, భారతి పెళ్లి చెడగొట్టడానికి సాగరయ్య పన్నాగం పన్నుతాడు. కాబట్టి నేరుగా కోటయ్య కూడా అతనిపై తిరుగుబాటు చేసినప్పుడు పెళ్లిని ఆపమని సాగరయ్య బలవంతం చేస్తాడు. వివాహ సమయంలో, సాగరయ్య కుట్ర చేసి పెళ్లి ఊరేగింపుపై దాడి చేస్తే వేణు వారిని రక్షిస్తాడు. పంట విరివిగా పండుతున్నప్పుడు సాగరయ్య అక్కడ ఉన్న రిజర్వాయర్‌ను పేల్చివేస్తాడు. చివరికి గ్రామం మొత్తం ఏకమై పంట నాశనం కాకుండా కాపాడుతారు. జమీందారు సాగరయ్యను ఆపేసి, అతన్ని అరెస్టు చేస్తారు. గోపాలం మరియు భారతి వివాహం జరిగి కోటయ్య వేణు మరియు రాధలను తిరిగి ఇంటికి ఆహ్వానించడంతో చిత్రం ముగుస్తుంది.

నటీనటుల ఎంపిక…

రోజులు మారాయి సినిమాలో హేమాహేమీలైన నటీనటులను ఎంపిక చేశారు. నటన విషయానికి వస్తే ముందుగా ఎక్కువ మార్కులు హేమలత, షావుకారు జానకి, రేలంగిలకు ఇవ్వాలి. రాధా పాత్ర  షావుకారు జానకి గారికి ఒక అపూర్వమైన అవకాశం. ఆమె పలికిన సంభాషణల తీరు ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది.  ఏమాత్రం నాటకీయతకు తావివ్వని రీతిలో ఆ పాత్ర మనోభావాలను జానకి గారు అద్భుతంగా ప్రదర్శించారు. ఈ సినిమా ప్రథమార్థంలో తిరుగుబాటు ధోరణి గల యువతిగా, ద్వితీయార్థంలో ఇంటా బయటా ఎదురైన సమస్యల్ని పరిష్కరించే తెలివిగల ఇల్లాలిగా జానకి నటన అద్భుతం, అమోఘం. ఆమె తాపీ చాణక్య గారి అభిమాన నటి.

జానకి ముఖంలో ఎన్నో భావాలు పలుకుతాయని, చివరికి తన చుబుకం కూడా మాట్లాడుతుందని తాపీ చాణక్య గారు అనేవారు. ఆ తరువాత రోజులలో జానకి, అక్కినేని నాగేశ్వరావు గార్ల కలయిక విజయవంతం అన్న ముద్రకు నాంది పలికింది ఈ చిత్రమే. ఆ తరువాత అక్కినేని, షావుకారు జానకి జంటగా నటించిన ప్రతీ చిత్రం విజయవంతమైంది. మరే ఇతర కథానాయికలతో అక్కినేని గారికి అంత పేరు రాలేదు. ఇక ఈ సినిమాలో వీరమ్మ పాత్రలో నటి హేమలత గారు జీవించారనే చెప్పాలి. వేణు పాత్రలో అక్కినేని నాగేశ్వరావు గారి నటన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను రైతు కుటుంబంలో జన్మించడం వలన నాట్లు వేయడం, తూర్పారా పట్టడం వంటి సన్నివేశాలలో అత్యంత సహజంగా నటించారు. 

వాచకంలోనూ హావాభావ ప్రదర్శనలోనూ ఆయన చాలా సహజత్వాన్ని చూపారు. ఆ తరువాత వచ్చిన “నవరాత్రి”, “పల్లెటూరి బావ”, “దసరా బుల్లోడు” వంటి చిత్రాలు గ్రామీణ యువకుడిగా అక్కినేని గారు ప్రదర్శించిన నటనతో ఈ చిత్రంలోని ఆయన నటనను పోల్చిచూసినప్పుడు వ్యత్యాసాన్ని గమనించవచ్చు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలలో ఆవేశంలో నటించాల్సిన సందర్భంలో కూడా మౌళికమైన హుందాతనాన్ని వదల్లేదు. తన నటన ఎక్కడా కూడా మెలోడీ డ్రామా అనిపించదు. సాగరయ్యగా సి.ఎస్.ఆర్. ఆంజనేయులు, సాంబయ్యగా రమణారెడ్డి, కోటయ్యగా పెరుమాళ్ళు, పోలయ్యగా రేలంగి వారి వారి పరిధి మేరకు వారు నటించారు.

సమర్థవంతమైన సంభాషణలు..

రోజులు మారాయి సినిమాకు రచన, సంభాషణలు కొండేపూడి లక్ష్మీనారాయణ గారు. ఆయన వ్రాసిన సంభాషణలలో గ్రామీణ భాషలలో ఉన్న మాధుర్యం వెల్లువై పొంగింది. ఇందులో వివిధ రకాల సామెతల్ని, జాతీయాల్ని ఉపయోగించారు. “ఎద్దుని అడిగి గంత కడతామా”, “మిరపకాయలు తిన్న కాకిలా అరుస్తున్నావు” వంటి జాతీయాల్ని ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. అయితే సినిమా మొత్తం రోజులు మారాయి, రోజులు మారాయి అని పాత్రలన్నింటి చేత పదేపదే చెప్పించడంలో మాత్రం కాస్త విసుగు కనిపిస్తుంది.

కొసరాజు రాఘవయ్య చౌదరి, తాపీ ధర్మారావు గార్లు వ్రాసిన పాటలు గ్రామీణ సంస్కృతిని అణువణువునా ప్రతిబింబింపజేస్తాయి. ఈ గీతాలలో అధిక భాగం మూడు స్థాయిలను అంటే వైయుక్తిక, సామాజిక, దేశస్థాయిలను సృష్టించేవిగా ఉంటాయి. కొసరాజు గారు వ్రాసిన పాటల్లో అటు గ్రామీణ పదాల జోరు, ఇటు గ్రాంథిక పదాల హోరు సమానాంతరంగా సాగాయి. ఉదాహరణకు “రండయ్య పోదాము మనము” అనే పాటలో గట్లు తన్నుక పంట కాలువలు పారాలి,  ఏళ్లు కోళ్ళేకమై ఎగసి నీళ్లురకాలి వంటి పాదాల్లో గ్రామ్య భాష అందాలు మనల్ని ఆనందపరుస్తాయి. ఇదే పాటలో భూమి కరుణించి పులకాంకురంబెత్తి, “గర్భదారిద్ర్యంబు కడతేరిపోవాలి” వంటి పాదాల్లో గ్రాంథిక భాష మనల్ని కొంత గాబరా కలిగిస్తుంది.

మాస్టర్ వేణు సంగీతం…

ఈ చిత్రంలోని పాటల సాహిత్యానికి తగిన స్థాయిలో మధురమైన బాణీలను అందించిన ఘనుడు మాస్టర్ వేణు. పియానో, హేమంత్ ఆర్గాన్, సెల్లో వంటి పదిహేను రకాల సంగీత వాయిద్యాలని వాయించడంలో మాస్టర్ వేణు గొప్ప నిష్ణాతుడు. ప్రముఖ హిందీ సంగీత దర్శకులైన నౌషాద్, యస్.డి.బర్మన్ లకు వేణు ఏకలవ్య శిష్యుడు. వేణు ప్రతిభకు మచ్చుకకు పేర్కొనల్సిన సంగతి ఒకటి ఉంది. అదేమంటే వేణు అనుమతితో బర్మన్ “ఏరువాక సాగరో” బాణీని తాను సంగీతం అందించిన “బొంబాయి కా బాబు” చిత్రంలో వినియోగించుకోవడం. ఇది ఆనాటి తెలుగు సంగీత దర్శకులలో వేణుకు మాత్రమే దక్కిన అపూర్వ గౌరవం. వేణుకు ఒక జీవితం మొత్తంలో ల్యాండ్ మార్క్ గా “ఏరువాక” పాట నిలిచిపోయింది. అదేవిధంగా గాయని జిక్కీ గారికి కూడా ఈ పాట వచ్చిన తొలి రెండేళ్లు పరిశ్రమలోనూ, ఇటు కచేరిలలోనూ తీరికలేని గాయని అయిపోయారు.

తాపీ చాణక్య…

తాపీ చాణక్య దర్శకత్వం తన పనితనానికి సినిమా తుదిఘట్టంలోని సన్నివేశాలే చక్కని ఉదాహరణ. ఏమాత్రం విసుగురాకుండా తాను సన్నివేశాలని చకచకా నడిపించారు. పాటల చిత్రీకరణలో అద్భుతమైన వైవిధ్యాన్ని చక్కగా చూపించారు. కథను ఆసక్తిదాయకంగా, రసవత్తరంగా తెరకెక్కించడంలో తాపీ చాణక్య గారి నేర్పు అమోఘం. పాత్రలకు తగిన పాత్రధారులను ఎంపిక చేయడంలో కూడా తాపీ చాణక్య గారు చాలా సమర్థవంతంగా వ్యవహరించిన సమర్థులు.

“ఏరువాక ” పాట సినిమాకు జవజీవం  

ఈ చిత్రానికి “ఏరువాక సాగారో” పాట మకుటాయమానం. ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరి గారు “పాలేరు” చిత్రం కోసం 1953లో వ్రాయగా సంగీత దర్శకులు “మాస్టర్ వేణు” ఆ పాటకు స్వర కల్పన చేశారు. అయితే ఆ సినిమా పురిట్లోనే సంధి కొట్టుకొని పోవడంతో దర్శక నిర్మాతలు ఆ పాటను “రోజులు మారాయి” లో ఉపయోగించుకున్నారు. ఆ రోజులలో ఈ పాట ఊరు వాడా అదరగొట్టేసింది. ఈ పాట వచ్చినప్పుడు థియేటర్ లలో ప్రేక్షకులు ఆనందంతో తెరమీదకి డబ్బులు విసిరేవారు. దాంతో థియేటర్ నిర్వాహకులు ఇంటర్వెల్ లో స్థానిక కళాకారులను తీసుకొచ్చి ఈ పాటకు నృత్యం చేయించేవారు. ఈ పాట కోసమే జనం పదేపదే సినిమా హాల్ కి రావడం గమనించిన సారథి వారు ఈ ఒక్క పాటకు చేతితో రంగులద్ది కొన్ని కేంద్రాలలో విడుదల చేశారు. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ ఫార్ములా ను తిరగరాసి కొత్త ఒరబడి సృష్టించిన పాట ఇది. నాట్లు వేసే సందర్భంలో “మహారాజ వినవయ్యా” అని ఇంకో చక్కని పాట ఉంది. ఈ గీతంలోని సాహిత్యం ఎంతటి పాషాణ హృదయున్నయినా కంటనీరు తెప్పించేటంత కరుణ రసాత్మకంగా ఉంటుంది. ఇలా ఈ చిత్రంలోని పాటలన్నీ సాహిత్యామృత ఝరులే. మాటవరుసకైనా ఒక అసభ్య గీతం లేని చిత్రం, నిర్మాతల ఉత్తమ అభిరుచికి తిరుగులేని సాక్ష్యం.

వహీదా రెహమాన్ ఎంపిక…

రోజులు మారాయి చిత్ర నిర్మాణం దాదాపు పూర్తయిపోయింది. ఈ సినిమా నిర్మాణ వ్యవహార్త సివిఆర్ ప్రసాదును కలిసిన నృత్య దర్శకుడైన వెంపటి పెద్ద సత్యం గారు నా సంగతి మీరు మర్చిపోయారా? ఇందులో నాది ఒక నృత్యమైనా లేకపోతే ఎలా అని ఆ సమయంలో గుర్తు చేశారు. అలా వచ్చిన పాట “ఏరువాక సాగారో”. ఈ పాటకు ముందుగా నాట్యతారగా కుమారి కమల ఎంపికైంది. కానీ కారణాంతరాల వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకుంది. దాంతో ఈ పాటకు కుచల కుమారి, జ్యోతి ఇలా చాలామందిని సంప్రదించారు. అయినా ఎవ్వరూ కుదరకపోవడంతో దర్శకులు తాపీ చాణక్య గారు ఎవరైనా కొత్త అమ్మాయి అయితే బాగుంటుందని అన్నారు.

అప్పటికే విఠలాచార్య కన్యాదానం లో నృత్యం చేసి ఎన్టీఆర్ తో కథానాయికగా “జయసింహ” చిత్రానికి ఎంపికై ఉన్న వహీదా రెహ్మాన్ ని తీసుకున్నారు. అయితే ఆమె ఎంపిక వెంపటికి సత్యానికి అంతగా నచ్చలేదు. వారం రోజుల పాటు శ్రద్ధగా ఆమె చేసిన రిహార్సల్ చూసిన తరువాత ఆమెను తీసుకోవడానికి వెంపటి సత్యాం అంగీకరించారు. ఆ విధంగా వహీదా రెహమాన్ గారికి “ఏరువాక” పాటకి నృత్యం చేసే మహత్తర అవకాశం లభించింది. ఆనాటికే వేదిక మీద నృత్యాలు చేయడంలో బాగా అనుభవం ఉన్న వహీదా రెహమాన్ గారు అవలీలగా ఈ జానపద నృత్యాన్ని చేసింది. శాస్త్రీయ నృత్య భంగిమలకు భిన్నంగా సత్యం గారు నృత్య గీతానికి అభినయాన్ని కంపోజ్ చేశారు. ఇందులో “నవధాన్యాలను గంపకెత్తుకోవడం”, “ఉరుముల మెరుపుల వానలు కురియడం”, “విత్తనము విసిరి విసిరి చల్లుకోవడం” వంటి వాటికి వహీదా రెహమాన్ చేసిన జానపద నృత్యానుగుణమైన అభినయమే గొప్ప తార్కాణం.

విజయోత్సవ సభలు… 

 రోజులు మారాయి సినిమా 14 ఏప్రిల్ 1955 నాడు విడుదలైంది. ఈ చిత్రం థియేటర్లలో 25 వారాలకు పైగా నడిచింది. తద్వారా సిల్వర్ జూబ్లీ చిత్రంగా మారింది. తమిళంలో “కాలం మారిపోచి” (1956) గా పునర్నిర్మించబడింది. తెలుగు చిత్రసీమలో సాంఘిక చిత్రాల్లో “రోజులు మారాయి” ఒక మైలురాయిగా పరిగణించబడుతుంది. ఈ సినిమా మొత్తం 17 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం అన్ని కేంద్రాల్లోను శత దినోత్సవ సభలు ముందుగా ఏ ఏ తేదీల్లో ఏ ఏ చోట్ల జరుగుతాయో ముందుగానే పత్రికా ప్రకటన ఇచ్చి మరీ నిర్వహించారు. ఈ చిత్రం హైదరాబాదు దీపక్ లో 70 రోజులు నడిచింది, అలాగే సికింద్రాబాదు రాజేశ్వర థియేటర్ లో 105 రోజులు ఆడింది. అయితే ఈ రెండింటిని కలిపి సిల్వర్ జూబ్లీ చేశారు. అలా జంట నగరాలలో సిల్వర్ జూబ్లీ చేసుకున్న మొదటి చిత్రం “రోజులు మారాయి” అయ్యింది.

వహీదా జీవితాన్ని మార్చేసిన విజయోత్సవ సభలు..

రోజులు మారాయి సినిమా విజయవంతంను పురస్కరించుకొని నిర్వహించిన విజయోత్సవ సభలు వహీదాను రెహమాన్ గారిని ఉత్తరాదిలో అగ్రశ్రేణి తారగా ఓ వెలుగు వెలిగేలా చేశాయి. అలనాటి సుప్రసిద్ధ హిందీ నటుడు గురుదత్ అదే సమయంలో తన సినిమా పంపిణీ వ్యవహారాల కోసం హైదరాబాదుకు వచ్చారు. సిల్వర్ జూబ్లీ వేడుకలో పాల్గొనడానికి వచ్చిన “రోజులు మారాయి” చిత్రబృందం గురుదత్ గారు బసచేసిన రిడ్జ్ హోటల్ లోనే దిగారు. సారథి నిర్మాణ సంస్థ అధినేత రామకృష్ణ ప్రసాద్ గారు అక్కడే ఉన్న “గురుదత్” గారికి వహీదా రెహమాన్ ను పరిచయం చేశారు. అలా పరిచయమైన వహీదా రెహమాన్ ను చూసి, మాట్లాడి తొలిసారిగా తన హిందీ చిత్రం సి.ఐ.డి.లో ఒక ప్రధాన పాత్రను ఇచ్చారు గురుదత్ గారు. 

ఆ సినిమా తరువాత వహీదా రెహమాన్ గారు హిందీ తారపథంలో దూసుకుపోయిన విధానం అందరికీ తెలిసిందే. తెలుగులో ఘన విజయం సాధించిన “రోజులు మారాయి” చిత్రాన్ని తమిళంలో “కాలం మారిపోచ్చి” పేరుతో పునర్నిర్మించారు. అందులో షావుకారు జానకి పాత్రను అంజలీదేవి గారు ధరించారు. తమిళంలో తీసిన ఆ సినిమా కూడా విజయవంతం అయ్యింది. ఈ చిత్రం విడుదలై నేటికీ అరవై తొమ్మిది ఏళ్లయినా ఇప్పటికీ రైతులు సమస్యలపై పెద్దగా మార్పు లేదు, పైగా నాటి రైతులలో కనిపించిన ఆత్మవిశ్వాసం కూడా నేడు లేకుండా పోయింది. ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారు. రోజులు మారాయిని వారికి ధైర్యం చెప్పగల అద్భుతమైన చిత్రం వస్తే బాగుండు.

Show More
Back to top button